* రెండు టాయిలెట్లకు 35 లక్షలు ఖర్చు
* టాయిలెట్లలోకి ప్రవేశించేందుకు స్మార్ట్‌కార్డ్ విధానం
* హైటెక్ టాయిలెట్లపై ఉద్యోగుల ఆగ్రహం
* పరిమితి లేని ఖర్చుపై అధికారుల నిర్లక్ష్యం
ఢిల్లీలోని యోజనా భవన్‌లో ఏర్పాటు చేసిన హైటెక్ టాయిలెట్ల వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. కేవలం రెండు టాయిలెట్ల కోసం 35 లక్షలు ఖర్చుబెట్టిన ప్రణాళికా సంఘం అధికారులపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే ఇంతా జరగుతున్నా అధికారులు మాత్రం ఇదంతా రొటీనే అని చెప్పుకొస్తున్నారు.రోజుకు పాతిక రూపాయలకు పైగా ఖర్చు చేస్తే చాలు అతను పేదవాడు కాదు.. అని నిర్వచనమిచ్చిన ప్రణాళిక సంఘం పెద్దలు... తమ భవనంలోని టాయిలెట్లకు మాత్రం లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీలోని యోజనాభవన్ లో ఉన్న రెండు టాయిలెట్ల రిపేర్ కోసం అధికారులు ఏకంగా 35 లక్షలు ఖర్చు చేశారు. అత్యంత ఆధునాతనంగా తీర్చిదిద్దిన ఈ శోచాలయాల్లోకి పరిమిత సంఖ్యలోనే జనాన్ని అనుమతిస్తున్నారు. దీనికోసం 5 లక్షలు ఖర్చు చేసి... డోర్ యాక్సెస్ కంట్రోల్ సిస్టం ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రవేశించేందుకు.. అతి కొద్ది మందికే స్మార్ట్ కార్డులు కూడా జారీ చేశారు. ఇక్కడే పెద్దసార్ల వ్యూహం బెడిసికొట్టింది. ఆఫీసులో పనిచేసే తమనే అందులోకి అనుమతించకపోయే సరికి.. కింది స్థాయి ఉద్యోగులకు చిర్రెత్తుకొచ్చింది.
ఇదేమిటని నిలదీయడంతో పాటు.. దీనికైన ఖర్చు వివరాలు తెలపాలంటూ.. ఓ ఉద్యోగి.. సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాడు. దీని ద్వారా వెల్లడైన నిజాలు చూసే సరికి అందరికీ దిమ్మ తిరిగిపోయింది. పేదరికానికి కొత్త భాష్యం చెప్పిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా మాత్రం.. భవనంలోని మొత్తం టాయిలెట్ల మరమ్మత్తుల కోసం ఆ మొత్తాన్ని కేటాయించామని చెబుతున్నారు. 50 ఏళ్ల కిందటి యోజనాభవన్‌లో అనేక పారిశుద్ధ్య సమస్యలున్నాయని.. అందుకే రిపేర్లు చేపట్టాల్సి వచ్చిందని అంటున్నారు.మొత్తం మీద ఈ హైటెక్ టాయిలెట్ల విషయం రచ్చ రచ్చ అయ్యే సరికి అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఉద్యోగులందరికీ ఇందులోకి అనుమతించేలా.. యాక్సెస్ కంట్రోల్ సిస్టంను తొలగించారు. అయితే ఖర్చు విషయంలో ప్రశ్నిస్తే మాత్రం.. ఇదంతా రొటీనే అంటూ నిర్లక్ష్యపు సమాధానమిస్తున్నారు.