గురువారం, జూన్ 7, 2012, 16:03 [IST]
చెన్నై: కేంద్ర హోంమంత్రి చిదంబరంకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురయింది. 2009 లోకసభ ఎన్నికకు సంబంధించిన చిదంబరం వేసిన పిటిషన్‌ను మద్రాసు కోర్టు గురువారం కొట్టివేసింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ ఏఐడిఎంకె పార్టీ పార్లమెంటు అభ్యర్థి రాజా కన్నప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ చిదంబరం పిటిషన్ వేశారు. దానిని న్యాయస్థానం కొట్టి వేసింది. రాజా కన్నప్పన్ వేసిన పిటిషన్ పైన విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
2009 ఎన్నికలలో చిదంబరం అవకతవకలకు పాల్పడి గెలిచారని రాజా కన్నప్పన్ గతంలో కోర్టును ఆశ్రయించారు. అప్పటి ఎన్నికలలో రాజా కన్నప్పన్ స్వల్ప మెజార్టీతో చిదంబరం చేతిలో ఓటమి చవి చూశారు. చిదంబరం డబ్బులను వివిధ బ్యాంకుల ద్వారా ఉప ఎన్నికల ప్రచారం కోసం వినియోగించారని, వాటికి లెక్కలు చూపించలేదని రాజా కన్నప్పన్ అప్పటి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చిదంబరం అనుచరులు ఓటర్లను కూడా కొన్నారని పేర్కొన్నారు. రాజా కన్నప్పన్ పిటిషన్ పైన చిదంబరం గత సంవత్సరం ప్రిలిమినరీ ఆబ్జెక్షన్ పిటిషన్ వేశారు. దానిని కోర్టు తిరస్కరించింది.
ఆ తర్వాత స్ట్రైక్ ఆఫ్ పిటిషన్ వేశారు. దీనిని తాజాగా మద్రాసు కోర్టు కొట్టి వేసింది. అయితే చిదంబరంపై వేసిన 29 ఆరోపణలలో అవినీతి ఆరోపణలతో కూడిన రెండు కేసులను కోర్టు తొలగించింది. ఉప ఎన్నికల ప్రచారం కోసం బ్యాంక్ నుండి నిధులను ఉపయోగించిన ఆరోపణలను తొలగించింది. కన్నప్పన్ జూన్ 25, 2009లో పిటిషన్ వేశారు. అంతేకాదు.. నియోజకవర్గం ఓట్లను మరోసారి లెక్కించాలని ప్రత్యేకంగా అలంగుడి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్లను లెక్కించాలని కోరారు.
కాగా చిదంబరం 2009లో శివగంగ నియోజకవర్గం నుండి 3354 ఓట్లతో రాజా కన్నప్పన్ పైన గెలుపొందారు. కాగా మద్రాసు కోర్టు నిర్ణయంపై ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు. చిదంబరం వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయకుంటే ప్రజాస్వామ్యానికే మచ్చ అని జయలలిత అభిప్రాయపడ్డారు.