న్యూఢిల్లీ, జూన్ 6: టుజి స్పెక్ట్రమ్ కేసులో ప్రధాన నిందితుడు, టెలికాం మాజీ మంత్రి ఎ రాజాకు ఉపశమనం కలిగే ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు వెలువరించింది. రాజా సొంత రాష్ట్రం తమిళనాడులో పర్యటించడానికి న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. 1.75 లక్షల అవినీతి కేసులో అరెస్టయిన రాజా 15 నెలల పాటు తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల 15న రాజాకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. తమ అనుమతి లేకుండా ఢిల్లీ వదలి వెళ్లవద్దని సిబిఐ ప్రత్యేక జడ్జి ఒపి సైనీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాగా సొంత రాష్ట్రానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డిఎంకె ఎంపీ చేసుకున్న అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 8 నుంచి 30 వరకూ రాజా తమిళనాడులో పర్యటించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కోర్టుకు జూన్ 9 నుంచి 30 వరకూ వేసవి సెలవులు కాబట్టి 2జి స్పెక్ట్రమ్ కేసు విచారణకు వచ్చే అవకాశాలు లేవు. దీంతో 15న ఇచ్చిన బెయిల్ ఆదేశాలకు లోబడి తమిళనాడు వెళ్లడానికి రాజాకు అనుమతి మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో రాజాతో పాటు 13 మంది నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే
.