NEWS

Blogger Widgets

8.6.12

చిదంబరాన్ని తప్పించండి





న్యూఢిల్లీ/చెన్నై, జూన్ 7: కేంద్ర హోంమంత్రి చిదంబరంపై దాఖలైన ఒక ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయడానికి మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని బిజెపి, అన్నాడిఎంకె పార్టీలు గురువారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను డిమాండ్ చేశాయి. మరోపక్క కేంద్రం, కాంగ్రెస్ పార్టీలు చిదంబరానికి బాసటగా నిలుస్తూ ఆయన రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చాయి. బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ హోంమంత్రిపై ధ్వజమెత్తుతూ, మంత్రిగా కొనసాగేందుకు చిదంబరానికి నైతికహక్కు లేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఈ సాక్ష్యం సరిపోదా? నైతికంగా చిదంబరానికి మంత్రిపదవిలో కొనసాగే హక్కు లేదు. ఆయన ఇదివరకే రాజీనామా చేసివుండాల్సింది. ఆయన్ని మేము పార్లమెంట్‌లో బాయ్‌కాట్ చేశాం. అయినప్పటికీ ప్రధాని దీన్ని సీరియస్‌గా పరిగణించలేదని గడ్కారీ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో విలేఖర్లతో మాట్లాడుతూ చిదంబరం ఇంకా మంత్రి పదవిలో కొనసాగితే అది ప్రజాస్వామ్యానికే అవమానమని వ్యాఖ్యానించారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తానుగా మంత్రి పదవి నుంచి వైదొలగాలి. లేదంటే ప్రధాని ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ హోంమంత్రి రాజీనామాకు బిజెపి డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు. రాజీనామా చేయాలన్న డిమాండ్ బిజెపికి రోజువారీ ఆనవాయితీగా మారిందని, ఇందుకోసం చిదంబరం ప్రింట్ చేసిన రాజీనామా పత్రం దగ్గర ఉంచుకోవాలంటారా? అని ప్రశ్నించారు. ప్రతిరోజూ ఇలా డిమాండ్ చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.