ఇస్లామాబాద్, జూన్ 7: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి గురువారం తన కుమారుడు ఆర్సలన్ ఇఫ్తికార్‌కు సంబంధించిన ఒక కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఉన్న కేసులను ప్రభావితం చేసేందుకు పారిశ్రామికవేత్త మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి రూ.400 మిలియన్లు తీసుకున్నట్లు ఆర్సలన్ ఇఫ్తికార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు విచారణను చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. అయితే గురువారం ధర్మాసనం ఈ కేసు విచారణను పునఃప్రారంభించినప్పుడు జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి తన నిర్ణయాన్ని వెల్లడించారు. కుమారుడికి సంబంధించిన కేసును విచారిస్తున్న ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి ఉండటాన్ని అంతకుముందు కొందరు న్యాయ నిపుణులు విమర్శించారు. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి ఉండటాన్ని అటార్నీ జనరల్ ఇర్ఫాన్ ఖాదిర్ కూడా తప్పుబట్టారు. అటార్నీ జనరల్ అభ్యంతరంతో పాటు కేసులో ప్రాథమిక విచారణ ముగింపునకు రానుండటంతో కేసు విచారణ నుంచి ఇఫ్తికార్ తప్పుకున్నారు. ‘మీ స్వంత చర్యలకు మాత్రమే మీరు బాధ్యులు. మీ పిల్లల చర్యలకు కాదు.. అని ఖురాన్ చెప్పింది. దేవుడిపై మాకు విశ్వాసం ఉంది’ అని ఇఫ్తికార్ అన్నారు. తన కుమారుడి వృత్తి గురించి కాని వ్యాపారం గురించి కాని తనకు తెలియదని ఆయన వాదించారు. ఈ కేసు విచారణకు ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించి ఆయన కోర్టు హాలులోంచి వెళ్లిపోయారు.