హైదరాబాద్, జూన్ 7: ఓబుళాపురం గనుల కుంభకోణంలో అరెస్టయిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెపై ఉన్న తీవ్రమైన ఆరోపణలు కారణంగా అవినీతి నిరోధక చట్టం, సిఆర్‌పిసి, ఐపిసి కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో మరో ఐఏఎస్ అధికారి, శ్రీకాకుళం కలెక్టర్ వెంకటరామిరెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఓబుళాపురం గనుల కేసులో అప్పటి గనులశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపిన సిబిఐ అమెను ప్రాసిక్యూట్ చేసేందుకు కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేయడంతో రెండు నెలల క్రితం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ లేఖ రాసింది. ఈ ప్రతిపాదన నేపథ్యంలో శ్రీలక్ష్మి నుంచి కూడా వివరణ కోరిన ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి చివరకు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం సంతకం చేశారు. వాస్తవానికి శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యంలను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరిన ప్రభుత్వం తాజాగా శ్రీకాకుళం కలెక్టర్ వెంకటరామిరెడ్డిని కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరింది. ఇందులో ఇటీవల బిపి ఆచార్య ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ఎల్వీకి మాత్రం అనుమతి నిరాకరించింది. ఇప్పుడు శ్రీలక్ష్మికి కూడా అనుమతి ఇవ్వడంతో ఇక వెంకటరామిరెడ్డి మాత్రం మిగిలారు. ఆయన ప్రాసిక్యూషన్‌కు ఇటీవలే ప్రతిపాదన రావడంతో నిర్ణయానికి మరికొంత కాలం పడుతుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఇలా ఉండగా, సిబిఐ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరామిరెడ్డి ఈ నెల 11న సిబిఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే కోర్టు నుంచి ఆయనకు సమన్లు రావడంతో ఆయన తప్పనిసరిగా కోర్టు ముందుకు రావాల్సి ఉంది. అందుకే 10, 11 తేదీల్లో తనను ఎన్నికల విధుల నుంచి తప్పించి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు దరఖాస్తు చేస్తున్నారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి కూడా లభించినట్లు సమాచారం
.
.