ఉప ఎన్నికల ప్రచారం కోసం రాక
అడ్డుకుంటామన్న తెలంగాణ విద్యార్థి సంఘాలు
మేం అడ్డుకోం.. నిరసనలకు దూరం: టీఆర్ఎస్
ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు?: బీజేపీ
పరకాలలో హైటెన్షన్.. అప్రమత్తమైన సురేఖ బృందం
తెలంగాణ విద్యార్థి సంఘాల హెచ్చరికలు, 'మానుకోట' చేదు అనుభవాల నడుమ యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి ప్రచార రథం శుక్రవారం వరంగల్ జిల్లాలో అడుగుపెట్టనుంది. పార్టీ అభ్యర్థి సురేఖ కోసం పరకాల నియోజకవర్గంలో విజయలక్ష్మి ప్రచారం నిర్వహిస్తారు. విజయలక్ష్మి ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లును సురేఖ బృందం ఇప్పటికే పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటలకు గీసుకొండలో సభలో విజయలక్ష్మి పాల్గొంటారు.
సాయంత్రం పరకాలలో కుమార్తె షర్మిలతో కలిసి రోడ్‌షో నిర్వహిస్తారు. అయితే, 'మానుకోట' ఘటన తరువాత, ఈ రెండేళ్లలో జగన్‌పార్టీకి చెందిన అగ్రనేత ఎవరూ వరంగల్ జిల్లాకు పోలేదు. మే 28, 2010న జగన్ మానుకోటలో ఓదారు యాత్ర చేయడానికి ప్రయత్నించి తెలంగాణ వాదుల ప్రతిఘటనతో నల్గొండ జిల్లా వంగపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉండటంతో తల్లి విజయలక్ష్మి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో విజయలక్ష్మి పరకాలకు బయలుదేరుతున్నారు.
పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం..విజయలక్ష్మి తన కూతురు షర్మిలతో కలిసి గురువారం రాత్రి కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి రైలులో బయలుదేరి శుక్రవారం ఉదయానికి వరంగల్ చేరుకుంటారు. అక్కడి నుంచి పరకాల నియోజకవర్గంలోని మండలాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు. తొలుత గీసుకొండ, సంగెం మండలాల్లో సాగే రోడ్ షో..ఆత్మకూరు మండలం మీదుగా పరకాల మండలానికి చేరుకుంటుంది. ప్రచారం ముగించుకొని తిరిగి రాత్రికి వరంగల్ చేరుకొని రైలులో నెల్లూరు వెళ్తారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న విజయలక్ష్మిని అడ్డుకోబోమని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటించగా, విద్యార్థి సంఘాలు మాత్రం కన్నెర్ర చేస్తున్నాయి.
ఆ పార్టీ విద్యార్థి విభాగం సహా అనేక విద్యార్థి సంఘాలు "పచ్చి సమైక్యవాది జగన్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకుంటా''మని హెచ్చరించాయి. తెలంగాణపై వైఖరి ప్రకటించాకే విజయలక్ష్మి తెలంగాణలో అడుగుపెట్టాల''ని తెలంగాణ యువసేన వ్యవస్థాపక కన్వీనర్ పిడమర్తి రవీంద్ర డిమాండ్ చేశారు. మానుకోట బాధితులను పరామర్శించకుండా పరకాలలో పర్యటించే హక్కు లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ అడుగుపెట్టే నైతిక హక్కు విజయలక్ష్మికి లేదని బీజేపీ దుయ్యబట్టింది.
|