కొడుకు కోసం రాజశేఖరరెడ్డి.. ఆయన కోసం మంత్రులు
మంత్రులతో తప్పు చేయించిన ముఖ్యమంత్రి
చరిత్రలో తొలిసారిగా మంత్రులు జైళ్లకు
మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో ఉండొచ్చు! ఆ తొర్రలో ఉన్న చిలకలో ఉండొచ్చు! మరెక్కడైనా ఉండొచ్చు! కానీ, రాజకీయ నాయకుడి - ఏ పార్టీ అయినా, ఏ స్థాయి అయినా - ప్రాణం మాత్రం అధికార పీఠంలోనే ఉంటుంది! అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి మూడు దశాబ్దాలపాటు రాజకీయ పోరాటం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ విషయం చాలా బాగా తెలుసు!
అందుకే, తన అడ్డగోలు దోపిడీకి సహకరించే వారినే కీలక శాఖల్లో మంత్రులుగా ఎంపిక చేసుకున్నారు. అధికార దాహానికితోడు మేళ్ల ప్రలోభంతో వారు వైఎస్ ఆడించినట్లు ఆడారు! ఆయన కరుణ ఉంటే చాలనుకున్నారు. తమ హవాను కొనసాగించవచ్చని భావించారు. "వైఎస్ నాయకత్వాన్ని నమ్మాను. అందుకే ఆయన చెప్పినట్లు సంతకం చేశాను'' అన్న మోపిదేవి వ్యాఖ్యల్లోని మర్మమిదేనా?
హైదరాబాద్, జూన్ 7 : మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జైలుకు వెళ్లారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు తదితరులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఏ ఒక్కరిపైనైనా ప్రజల్లో సానుభూతి ఉందా? అన్న ప్రశ్నకు 'లేదు' అన్న జవాబే వస్తుంది. కారణం.. మొత్తం రాజకీయ వ్యవస్థే నవ్వుల పాలైంది. గతంలో ఒకరిద్దరు మంత్రులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా.. వారు పదవి వదులుకోవాల్సి వచ్చి నా వ్యవస్థపై నమ్మకం మాత్రం సడలలేదు.
కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా మంత్రులు అవినీతిపరులు కారని, నిజాయతీగా ఉంటారని ఎవరూ అనరు... అనుకోరు. కానీ, ఇంత బరితెగించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ఘటనలు మాత్రం నభూతో! సీబీఐ విచారణ ఎదుర్కోవడం, అరెస్టు కావడం కూడా చరిత్రలో ఇదే తొలిసారి! అందుకే కొందరు మంత్రులు సీబీఐ విచారణను ఎదుర్కొని, వారిలో ఒకరిద్దరు జైలుకుపోయినా మొత్తం వ్యవస్థపైనే నమ్మకం సడలింది.
అయితే, ప్రస్తుతం సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రులు తమంత తాముగా అధికారాన్ని దుర్వినియోగం చేసి, అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించి ఉంటే ఈ చర్చకు ఆస్కారమే లేదు. గతంలోనూ మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారిలో కొందరు తప్పుకొంటే.. మరికొందరిని తప్పించారు. మెడికల్ కాలేజీలకు అనుమతులపై ఆరోపణలు రాగా, నేదురుమల్లి జనార్దన రెడ్డి సాక్షాత్తూ సీఎం పదవినే వదులుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు హయాంలో రూ.కోటి మేర స్టేషనరీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రి బంధువు ఒకరు కర్నూలులో మకాం వేసి లావాదేవీలు జరిపారని ఆరోపణలు వచ్చాయి.
ఇందులో మంత్రికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా అవినీతి ఆరోప ణలు వచ్చిన వెంటనే సదరు మంత్రిని చంద్రబాబు తప్పించారు. కానీ, ప్రస్తుత కేసులో సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రే మంత్రులతో తప్పు చేయించారు. కొందరు మంత్రులూ రెచ్చిపోయారు. అప్పటి కొన్ని నోట్‌ఫైళ్లను పరిశీలిస్తే అడ్డగోలు చీకటి దందాలు కళ్లకు కడతాయి. ఫలానా వారికి ఫేవర్ చేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే మంత్రులను ఆదేశించడం ఇప్పటి వరకు చరిత్రలో లేని వాస్తవం.
వాస్తవానికి, మూడు దశాబ్దాల కలలను సాకారం చేసుకోవడానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత పకడ్బందీగా పావులు కదిపారు. అధికారులనే కాదు.. మంత్రులను కూడా తన మాటకు ఎదురు చెప్పని.. కళ్లు మూసుకుని సంతకం చేసే వారినే 'దోపిడీ శాఖ'ల్లో నియమించుకున్నారు. అధికారులు, పారిశ్రామిక వేత్తలతోపాటు మంత్రులను కూడా పావులుగా వాడుకుని.. వారికి కూడా కొన్ని 'మేళ్లు' ఎరగా వేసి వారి ద్వారా తన పనిని చక్కబెట్టుకున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత బలమైన నాయకుడు. తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన ఇమేజ్‌తోపాటు అధిష్ఠానం అండదండలు పూర్తిస్థాయిలో ఉన్నాయి.
వైఎస్ మాటకు ఎదురు చెప్పి మనుగడ సాగించగలిగే పరిస్థితి అప్పట్లో లేదు. మంత్రి పదవిలో ఉండాలంటే చెప్పినట్లు చేయాల్సిందే! రాష్ట్రంవెలుపల ఉన్న మోపిదేవి వెంకటరమణకు సీఎంవో అధికారి భాను ఫోన్ చేయగానే నేరుగా విమానంలో వచ్చి ఫైల్‌లో ఏం ఉందో కూడా చూడకుండా సంతకం చేసినా.. కార్యదర్శి చెప్పిన వెంటనే సబితా ఇంద్రారెడ్డి దస్ఖతు చేసినా కారణం ఇదే! ఇదేమిటని ప్రశ్నిస్తే మంత్రి పదవి ఉండకపోవచ్చు. అడగకుండా సంతకం చేస్తే.. వైఎస్ 'కరుణ' లభిస్తుంది. దీనికి బోనస్‌గా 'మేళ్లు' ఇంటికొచ్చి పడతాయి. పదవీ పదిలంగా ఉంటుంది. తమ హవానూ కొనసాగించుకోవచ్చు.
ఇన్ని ప్రయోజనాలను ఆశించే అప్పట్లో కళ్లు మూసుకుని సంతకాలు పెట్టిన మంత్రులు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. వాస్తవానికి, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాటే ఫైనల్. పాలన పరమైన అంశాల్లో 'నే చూసుకుంటా. మీరు చేసేయండి' అని ఆయన భరోసా ఇవ్వడంలోనూ తప్పులేదు. కాకపోతే, అది విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించినది అయి ఉండాలి. తుపాను బీభత్సం సృష్టించింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి భారీ పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో 'ఇచ్చేయండి. నే చూసుకుంటా' అని ముఖ్యమంత్రి అనొచ్చు.
ఆరోగ్యశ్రీ వంటి పథకం అమల్లో ఇబ్బందులు ఎదురైతే నిబంధనలను పక్కకు పెట్టి మరీ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయవచ్చు. విస్తృత ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో సీఎం నిర్ణయాన్ని అభినందించవచ్చు కూడా. కానీ, ఇక్కడ పరిస్థితి అది కాదు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు అది కూడా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు వారికి మేళ్లు చేకూర్చడానికే వైఎస్ మంత్రులపై ఒత్తిడి తెచ్చారు. నిబంధనలను తోసిరాజని మరీ 'నీకింత - నాకింత' అంటూ ఆదేశాలు జారీ చేయడమే ప్రస్తుత అంశం. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రులపై ఎవరికీ సానుభూతి ఉండకపోవచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారికి కూడా మేళ్లు అంది ఉండొచ్చు.
అప్పటి వైఎస్ కేబినెట్‌లో సుమారు 30 మందికిపైగా మంత్రులు ఉన్నా కేవలం ఐదారుగురిపైనే సీబీఐ విచారణ జరుగుతుండటం గమనార్హం. ఇక, పరిపాలనకు సంబంధించిన, అవినీతి ఆరోపణలకు సంబంధించి అధికారులు అప్పుడప్పుడు మంత్రులు కోర్టులకు వెళ్లడం.. విచారణలకు హాజరు కావడం సహజమే. కానీ, ప్రస్తుత పరిస్థితి వేరు. ఓ దొంగగా, దోషిగా సీబీఐ విచారణలకు హాజరు కావడం సదరు మంత్రులనే కాదు.. రాజకీయ నాయకులందరినీ కలచి వేస్తోంది. ఒక్కడి కోసం.. ఒక్కడి వలన మొత్తం రాజకీయ వ్యవస్థే పతనమైంది. రాజకీయ వ్యవస్థపై విశ్వసనీయత పోయింది. ఒక్కడి స్వార్థానికి మొత్తం వ్యవస్థ నవ్వులపాలైంది!!
|