ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులపై ఆరా
అంతా పద్ధతి ప్రకారమే: పొన్నాల
సీబీఐ పిలుపు అందుకున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఐఏఎస్ ఆదిత్యనా«థ్ దాస్ గురువారం ఉదయం 10.30 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ హయాంలో పొన్నాల భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులతోపాటు సున్నపురాయి నిక్షేపాల లీజుల వంటి అనేక 'మేళ్లు' జరిగాయి. ఇందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో ఇండియా సిమెంట్స్ భారీగా 'పెట్టుబడులు' పెట్టింది.
ఈ నేపథ్యంలో... ఇండియా సిమెంట్స్‌కు జల కేటాయింపులపై మంత్రిని సీబీఐ ప్రశ్నించింది. కాగ్నా నది నుంచి నీటి కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయా? అంతర్రాష్ట్ర నీటి వనరుల ఒప్పందాలను పాటించారా? నీటి లభ్యత లేకున్నా... పైనుంచి వచ్చిన ఒత్తిళ్లకు లొంగి కేటాయింపులు జరిపారా? అనే కోణంలో మంత్రి పొన్నాలను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పటి సాగునీటి శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను కూడా ఇదే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల ఫైల్ వచ్చినపుడు... అంతర్రాష్ట్ర జల విభాగానికి వివరణ కోరుతూ ఎందుకు లేఖ రాయలేదని పొన్నాలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తమ శాఖ కార్యదర్శి అన్ని విషయాలను చూసిన తర్వాతే ఆ ఫైల్‌ను తన వద్దకు పంపించారని... అందువల్ల ఆ విషయాన్ని పట్టించుకోలేదని మంత్రి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. నీటి కేటాయింపులు జరిపినా ఇంకా, కాగ్నాలో మిగులు జలాలే ఉన్నాయని, ఈ నీటి కేటాయింపులపై ఎవరి నుంచి అభ్యంతరం రాలేదని పొన్నాల, ఆదిత్యనాథ్ సీబీఐకి వివరించినట్లు తెలుస్తోంది.
"పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకే ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులు జరిపాం! కింది నుంచి పైవరకు అన్ని స్థాయిల అధికారులు ఈ ఫైల్‌ను చూశారు. వారి సిఫారసుల ఆధారంగానే నీటి కేటాయింపు జరిగింది'' అని పొన్నాల స్పష్టం చేసినట్లు సమాచారం. కాగ్నా, కృష్ణా నది నుంచి నీటి కేటాయింపులు జరిపినపుడు దిగువ ప్రాంత హక్కుల గురించి సీబీఐ అధికారులు ఎక్కువగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. పొన్నాల, ఆదిత్యనా«థ్ దాస్‌లు ఇచ్చిన సమాచారాన్ని సీబీఐ రికార్డు చేసి... వారిద్దరి సంతకాలు తీసుకున్నారని తెలుస్తోంది. మంత్రి, ఇతర అధికారులను ప్రశ్నిస్తుండగా... మధ్యాహ్న భోజన సమయంలో మాత్రం జేడీ లక్ష్మీనారాయణ వీరి వద్దకు వచ్చారు.
కానీ... విచారణలో ఆయన జోక్యం చేసుకోలేదని తెలిసింది. విచారణ ముగిసిన తర్వాత పొన్నాల, ఆదిత్యనాథ్ దాస్ తిరిగి వెళ్తున్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ లిఫ్టు వరకు వారితోపాటే వచ్చినట్లు తెలిసింది. ఇంకా ఏమైనా సందేహాలుంటే మళ్లీ పిలుస్తామని మంత్రికి చెప్పగా... 'ఎప్పుడు పిలిచినా వస్తాను' అని పొన్నాల బదులిచినట్లు సమాచారం.
|