ఎందుకంటే.. జగన్ వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టుగా చంద్రబాబు కాలికిబలపం కట్టుకుని మరీ ప్రచారం చేస్తూ జగన్ చేసిన అవినీతిపై ప్రచారం చేస్తున్నారు. అదేసమయంలో దేశంలోనే రిచెస్ట్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు.. ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్న అంశాలను పరిశీలిస్తే...!!
ప్రస్తుతం రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా.. అనంతపురం జిల్లా రాయదుర్గం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జి.దీపక్ రెడ్డిని చంద్రబాబు నాయుడు బరిలోకి దించారు. ఈయన ఎన్నికల సంఘానికి నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ రూ.ఆరు వేల కోట్లపై చిలుకుగా పేర్కొన్నారు.
అదేసమయంలో 39 యేళ్ళ దీపక్ రెడ్డికి బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం కేవలం లక్షన్నర రూపాయలుగా పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల్లో 90 శాతం పైగా న్యాయపరమైన వివాదాల్లో ఉన్నట్టు ఆయన పేర్కొని ఎన్నికల సంఘం అధికారులు నివ్వెర పోయేలా కొత్త ట్విస్ట్ ఇవడం గమనార్హం. ఎంతైనా.. బిజినెస్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యూయేట్ తెలివితేటలు కదా.
కాగా, గ్రేట్ ఇండియన్ మైనింగ్, గ్రేట్ ఇండియా రాక్ మినరల్స్ యజమానిగా దీపక్ రెడ్డి కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ.ప్రతాప్ రెడ్డికి సొంత అల్లుడు. అయితే ఆశ్చర్యంగా దీపక్ రెడ్డి సంవత్సర ఆదాయం రూ.3.27 లక్షలుగా పేర్కొన్నారు.