తెలంగాణ కోసం రాజీనామా చేసిన
కొండా సురేఖను గెలిపించండి : విజయమ్మ
తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన కొండా సురేఖను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన అతికొద్దిమందిలో సురేఖ ఒకరని ఆమె అన్నారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా, పరకారల వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కొండా సురేఖ తరఫున గీసుకొండలో జరిగిన రోడ్ షోలో విజయమ్మ మాట్లాడుతూ తన కుమారుడు జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని, జగన్ బయటవుంటే ఉప ఎన్నికల్లో 18 సీట్లు గెలిపించుకుంటాడనే కుట్రతోనే ఆయనను జైలు పాలుచేశారన్నారు. వైఎస్ మరణంపై తమకు అనుమానాలున్నాయని, వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
దివంగత వైఎస్ మనమధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పట్టించుకున్ననాథుడే కరవయ్యారని విజయమ్మ అన్నారు. సీమాంధ్రతో సమానంగా తెలంగాణను అభివృద్ది చేయాలని మహానేత ప్రయత్నించారని చెప్పారు. ఫించన్లు ఇచ్చి వృద్ధులకు వైఎస్సార్ పెద్ద కొడుకు అయ్యారని అన్నారు.
|