NEWS

Blogger Widgets

8.6.12

చేపమందు పంపిణి వద్ద తొక్కిసలాట



ఇద్దరు మృతి, 40 మందికి గాయాలు
బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, సుమారు 40 మందికి పైగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. మృతిచెందిన వారికలో ఒకరు మహారాష్ట్రకు చెందిన గోరఖ్‌పాటిల్‌గా గుర్తించారు. గాయపడిన వారంతా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలియవచ్చింది.
 
ఈరోజు ఉదయం బత్తిన సోదరులు చేప మందు పంపిణి ప్రారంభం కాగానే ఒక్కసారిగా జనం తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఊపిరి ఆడక మహిళలు, ముసలివాళ్ళు పెద్ద పెద్దగా కేకలు వేశారు. 
 
చేపమందు కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు కాటేదాన్ లో సరైన సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచినీరు, ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, మహిళలు, వృద్దులతో వచ్చిన వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది.
 
పట్టించుకునే వారు ఎవరూ లేకపోవడంతో చేసేదేమీ లేక గతరాత్రి రోడ్లపైనే పడుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో కాకుండా స్థలం కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు మార్చడంతో ఇక్కడికి చేరుకోవడమే కష్టంగా మారిందని చేపమందు కోసం వచ్చినవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.