NEWS

Blogger Widgets

8.6.12

పొన్నాలకు జల గండం?


జగన్‌ ఆస్తుల కేసులో రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సీబీఐ గురువారం నాడు విచారించింది. వెైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అనేక ప్రైవేటు పరిశ్ర మలు, సంస్థలకు నిబంధనలకు విరుద్దంగా మేలు చేకూర్చే విధంగా మంత్రి ఆదేశాలు జారీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జల యజ్ఞం పనుల కేటాయింపులు, పెన్నా సిమెంట్స్‌, రఘురాం సిమెంట్స్‌కు నీటి కేటాయింపులు వంటి చర్యల ద్వారా అంతరాష్ట్ర జల ఒప్పందాల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మంత్రి జారీ చేసిన జీవోల ద్వారా లభ్దిపొందిన పెన్నా సిమెంట్స్‌, దాల్మియా సిమెంట్స్‌ సంస్థలు అందుకు ప్రతిగా జగన్‌ సంస్థల్లో కోట్లాది రూపాయల పెట్టు బడులు పెట్టినట్లుగా ప్రధాన ఆరోపణ. వీటిపెై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ గురువారం నాడు మంత్రితో పాటు భారీనీటిపారుదల శాఖ కార్యదర్శి, ఐఎఎస్‌ అధికారి ఆదిత్యానాథ్‌ దాస్‌ను కూడా విచారణకు పిలిపించింది. వీరిద్దరినీ విడివిడిగానూ, కలిపి కూర్చోబెట్టి విచారించిన అధికారులు అనేక ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. కాగా జగన్‌ ఆస్తుల కేసు విచారణ ప్రారంభించాకా ఇప్పటివరకూ జరగని విధంగా నిరాటంకంగా ఎనిమిదిగంటల పాటు పొన్నాల విచారణ కొనసాగింది.
 
ఉదయం పదకొండుగంటల ప్రాంతంలో పొన్నాల కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అంతకు ఇరవెై నిమిషాల ముందే ఆధిత్యానాధ్‌ దాస్‌ అక్కడకు చేరుకున్నారు. తన అధికార వాహనంలో వచ్చిన పొన్నాల చిరునవ్వులు చిందిస్తూ అక్కడ వేచిఉన్న మీడియాతో రెండునిమిషాలు మాట్లాడి కార్యాలయంలోకి ప్రవేశించారు. సరిగ్గా 11గంటల 30 నిమిషాలకు విచారణ ప్రారంభమైంది. అప్పటి నుంచి మధ్యాహ్నం వంటిగంటా 40 నిమిషాల వరకూ విచారించి 20 నిమిషాలు విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. అప్పటి నుంచి రాత్రి ఏడుగంటల 50 నిమిషాల వరకూ విచారణ కొనసాగింది. ఈ మధ్యలో చంచల్‌ గూడా జెైలునుంచి జగన్‌ను కస్డడీలోకి తీసుకోవడం, ఆయనను కూడా కోఠి కార్యాలయంలో విచారించి కస్టడీ సమయం ముగిసిన వెంటనే తిరిగి జెైలుకు తరలించడం జరిగిపోయింద
 
అయినా పొన్నాల విచారణ ముగియక పోవడంతో లోపల ఏంజరుగుతోందా అన్న ఆసక్తి సహచర మంత్రులకు, ఏదో జరిగిపోతోందన్న ఆందోళన పొన్నాల కుటుంబ సభ్యులు, అనుచరులలో వ్యక్తం అయింది. దాంతో ఏంజరుగుతోందంటూ కోఠి సీబీఐ కార్యాలయం వద్ద విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులకు ఫోన్‌లు చేసి మరీ సమాచారం తెలుసుకున్నారు. ఈ నేపధ్యంలో పొన్నాలను అరెస్ట్‌ చేసేఅవకాశాలున్నాయంటూ కొన్ని ఛానల్స్‌లో వార్తలు ప్రసారం కావడం కొంతగందరగోళానికి దారితీసింది.చివరకు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన సీబీఐ కార్యాలయం నుంచి బెైటకు వచ్చారు.
 
కొంచెంసేపు సరదాగా... తర్వాత సీరియస్‌గా
కాగా సహజసిద్దంగా జోకులు వేస్తూ, నవ్వుతూ మాట్లాడే పొన్నాల అదే తరహాలో సీబీఐ అధికారుల ఎదుట కూడా పెద్దపెద్దగా నవ్వుతూ కొద్దిసేపు మాట్లాడినట్లు తెలిసింది. ముఖ్యంగా ఉన్నతవిద్యావంతుడనెైన తాను చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చానంటూ కొద్దిసేపు తన గురించి తాను చెప్పుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా తన రాజకీయజీవితంలో ఇప్పటివరకూ అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లుగా ఎలాంటి ఆరోపణలు లేని మనిషినంటూ కూడా ఆయన వివరించినట్లు తెలిసింది. దాదాపు 25 నిమిషాల పాటు పొన్నాల మాట్లాడిన మాటలన్నీ వింటూనే అధికారులు అసలు విషయంలోకి ప్రవేశించారని తెలిసింది. ముందుగా పొన్నాలకు చెందిన సిరామిక్స్‌ కంపెనీకి సంబంధించి కెనరాబ్యాంక్‌ వ్యవహారం, వెంకటేశ్వరాహాచరీస్‌తో పాటు ఆయనకు హైదరాబాద్‌, బెంగుళూరులో సాప్ట్‌వేర్‌ కంపెనీలు, గుజరాత్‌లో భారీ పెట్టుబడులు వంటి సవివరమైన ఫెైలును ఆయన ముందుంచినట్లు తెలిసింది.
 
ఇవికాకుండా మరో డజను సంస్థల్లో పొన్నాల వ్యక్తిగత పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉన్నట్లు తెలిసింది. ఆ ఫెైలు చూసిన తరువాత పొన్నాల మరే విషయాలు మాట్లాడకుంటా కొద్దిసేపు మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా నిజాయితీ, విధినిర్వహణలో సిన్సియార్టీల గురించి తర్వాత మాట్లాడుకుందాం..ప్రసుత్తం మేమడిగిన ప్రశ్నలకు సూటిగా అసలేంజరిగింది అన్న అంశంపెై నిజాలు మాత్రమే మాట్లాడండి అంటూ సీబీఐ అధికారి సున్నితంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాగా పెన్నా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులతో పాటు దాల్మియా సిమెంట్స్‌‌క కృష్ణానదినుంచి పదిలక్షల గ్యాలెన్‌ల నీరు, కాగ్నానది నుంచి 13 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్‌ల నీటివినియోగానికి అనుమతుల మంజూరు విషయాలపెై ముందుగా భారీ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆధిత్యానాథ్‌ దాస్‌ను ప్రశ్నించారు. అయితే అప్పట్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య లిఖితపూర్వకంగా జారీ చేసిన ఆదేశాల మేరకే తాము ఆ కేటాయింపులకు సంబంధించి జీవో జారీ చేశామంటూస్పష్టం చేసిన దాస్‌ అందుకు సంబం దించిన డాక్యుమెంట్‌లను కూడా సీబీఐకి అందజేసినట్లు తెలిసింది.
 
నీటి కేటాయింపుల కోసం దాల్మియా సిమెంట్స్‌ ప్రభుత్వానికి రాసిన లేఖ, దానిని పరిశీలించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి చేసిన సిఫార్సు, నీటికేటాయింపులు జరపాలంటూ పొన్నాల చేసిన రికమండేషన్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను దాస్‌ సీబీఐ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. అదే విషయంపెై సీబీఐ అధికారులు పొన్నాలను ప్రశ్నించారని తెలిసింది.అయితే నీటి కేటాయింపుల వరకూ అది తన సొంతనిర్ణయం కాదని, క్యాబినెట్‌ ఆమోదంతో తీసుకున్న సమిష్టినిర్ణయంగా పొన్నాల వివరించినట్లు తెలిసింది. వీటికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి వెైయస్‌ నుంచి నోటిమాటగా ఆదేశాలే తప్ప లిఖితపూర్వకంగా ఫలానా పనిచేయండి అంటూ ఎలాంటి ఆదేశాలు తమకు అందలేదని ఆయన వివరించినట్లు తెలిసింది.
 
ఒక పరిశ్రమకు అవసరమైన నీటిని కేటాయించడం తప్పుగా తాను భావించలేదని, పెైగా అందరూ అంటున్నట్లు అది అంతర్రాష్ట్ర జలవనరుల ఒప్పందాల ఉల్లంఘన కూడా కాదని ఆయన వివరించినట్లు తెలిసింది. ముఖ్యంగా కృష్ణా, కాగ్నా నదులకు సంబంధించి మనరాష్ట్రంలో పారుతున్న నీటివనరులు వృధాగా పోకుండా వినియోగించుకోవడం ఒప్పందాల ఉల్లంఘన ఎలా అవుతుందని తాను భావించానని, అప్పట్లో అధికారులు కూడా అలాగే చెప్పారని మంత్రి వివరించినట్లు సమాచారం.ఈ సందర్భంగా సీబీఐ పొన్నాలను దాదాపు 29 ప్రధాన ప్రశ్నలు, 87 అనుబంధప్రశ్నలు వేసినట్లు తెలిసింది. మొత్తం మీద రాత్రి ఏడుగంటల యాభెై నిమిషాలకు విచారణ ముగించిన అధికారులు పొన్నాలను పంపివేశారు.
 
ఉత్సాహంగా వెళ్ళి...
ఇదిలా ఉండగా ఉదయం సీబీఐ విచారణకు ఉత్సాహంగా హాజరెైన మంత్రి రాత్రి బెైటకు వచ్చేసరికి విపరీతమైన నిరుత్సాహంతో కనిపించారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయన మోములో నవ్వుమాయం అయిపోయింది. వివిధ జీవోలకు సంబంధించి సీబీఐ అధికారులు అనేక ప్రశ్నలు వేశారని, తనకు తెలిసిన సమాచారం, సమాధానాలు తాను చెప్పానని పొన్నాల తర్వాత మీడియాకు వివరించారు. తిరిగి శుక్రవారం విచారణకు రావలసిందిగా సీబీఐ తనను కోరలేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.