NEWS

Blogger Widgets

8.6.12

సీబీఐ విచారణ.. నేరం నాది కాదు.. వేరే వాళ్ళదన్న జగన్


jagan
తన అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఆయనను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జగన్‌ను న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనను సీబీఐ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు. విచారణ అంతా సవ్యంగానే జరిగిందని చెప్పారు.
 

మరోవైపు.. ఐదు రోజుల విచారణ సరిపోలేదని అందువల్ల మరో రెండు రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపింది. ఆ సమయంలో జగన్ వద్ద జరిపిన విచారణ వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

జగన్‌ను తాము వేధించలేదని, కోర్టు సూచన మేరకు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిపినట్టు తెలిపింది. అంతేకాకుండా, ఐదు రోజుల విచారణలో అనేక విషయాలను రాబట్టామని, మరికొంత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని పేర్కొంది. జగన్ అరెస్టు తర్వాత కొంతమంది సాక్షులు ముందుకు వస్తున్నారని తెలిపింది. 

అలాగే, జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఆధారాలను సేకరించే పనిలోనే ఉన్నట్టు చెప్పారు. జగన్ సామ్రాజ్యం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా విస్తరించి ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైందని తెలిపింది. అయితే, జగన్‌ను ఎన్ని రకాలుగా ప్రశ్నించినప్పటికీ... తాను ఎలాంటి నేరం చేయలేదన్న సమాధానం మినహా మరో మాట చెప్పడం లేదన్నారు. పైపెచ్చు.. తనకు ఎలాంటి విషయాలు తెలియవంటూ ఇతరులపైకి నెట్టేశాడని సీబీఐ తరపు హైకోర్టుకు తెలిపింది.