
సుజీవ్, ఎరికా ఫెర్నాండెజ్, ప్రగ్యముఖ్యతారలుగా తేజ సినిమా సమర్పణలో, ఎస్.ఎ.సి. ప్రొడక్షన్స్ పతాకంపై కుమార్ రావిళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డేగ’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సమీపాన రూపొందించిన ట్రైన్ సెట్‌లో జరుగుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక రైలు ప్రయాణానికి సంబంధించిన రొమాంటిక్ థ్రిల్లర్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో మా అబ్బాయి సుజీవ్ హీరోగా నటిస్తున్నాడు.థాయ్‌లాండ్, బర్మా, లావోస్‌ల్లో ఇటీవల 15 రోజులపాటు తొలి షెడ్యూల్ జరిపాం’’ అని చెప్పారు.
సహనిర్మాత సీవీ రావు మాట్లాడుతూ -‘‘75 లక్షల రూపాయల వ్యయంతో ట్రైన్ సెట్ నిర్మించాం. ఆర్ట్ డెరైక్టర్ నారాయణరెడ్డి ఈ సెట్‌ని అద్భుతంగా రూపొందించారు. ఈ సెట్‌లో ఒక ఫైట్, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 25న మలేసియాలో ఆరంభించనున్నాం. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాధాకృష్ణ, సంగీతం: సి.ధరన్‌కుమార్.